YSR KADAPA - కాళికాంబ సప్తశతి / :
చావు నీడవోలె జీవిని వెన్నాడ |
పరుల బాధపెట్టువాడు పశువు |
పశువు మేలుగాదె పరులకు తోడ్పడు |
కాళికాంబ! హంస!కాళికాంబ! |
చావు మనిషిని నీడలాగా వెంటాడుతున్నా మనిషి ఇంకొకడిని బాధపెడుతూ ఉంటాడు. అతడు పశువు. అయితే పశువు ఈ మనిషికన్నా మేలు. అది ఇతరులకు తోడ్పడుతుంది. ఇతరులను హింసిస్తూ బతికే వాళ్ళకు బ్రహ్మంగారు ఇలా గడ్డి పెట్టారు. అసమ సమాజంలో హింస ఒక సహజమైన అంశం. కులపరంగానో మతపరంగానో సంపదపరంగానో హోదాపరంగానో జండర్ పరంగానో ప్రాంతపరంగానో ఏదో ఒకరకంగా హింస కొనసాగుతూ ఉంటుంది. పైన ఉన్నవాళ్ళు కింద ఉన్నవాళ్ళను శారీరకంగానో మానసికంగానో హింసిస్తూఉంటారు. ఈహింస మంచిది కాదు మారండి అని బోధించారు బ్రహ్మంగారు. ఉన్నవాళ్ళు తమ జీవితాలు శాశ్వతమని అనుకొని లేనివాళ్ళను పీడించే సాంఘిక ధర్మాన్ని ప్రజలతో మమేకమైనపుడు ఆయన గమనించారు. సమాజంలో పీడనను నిర్మూలించాలని కవిత్వంతో ప్రయత్నించారు. తనకుకూడా చావు వస్తుందన్న సత్యాన్ని మరచిపోయి హింసకు పాల్పడే వాడిని పశువు అన్నారు. లోకంలో దుర్మార్గులను పశువుతో పోల్చడం మనకు అలవాటు. నువ్వు మనిషివా పశువా అంటుంటాం. బ్రహ్మంగారు కూడా అలాగే అన్నారు. కానీ వెంటనే తేరుకొని పశువులు మనుషులకు మేలు చేస్తాయిగనక మనిషికన్నా పశువునయం అన్నారు. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నారు శ్రీశ్రీ గారు. ప్రతి వొకడూ ఇంకొకడిని పీడించేవాడే అన్నారు ఒక సినిమా పాటలో. ఒక ప్రాణికొకప్రాణి ఓగిరంబయ్యే వ్యవస్థ వద్దని అన్నారు జాషువ. ఈ పరపీడన పరాయణత్వం మీది చర్వాకులు బౌద్ధుల కాలం నుంచీ నిరసన వ్యక్తమౌతూనే ఉంది. అందులో బ్రహ్మంగారిది పెద్దగొంతుకే.
YSR KADAPA